కొన్ని జీవిత అనుభవాలు మనిషిని శాశ్వతంగా మార్చేస్తాయి. జీవితంలో వరుసగా ఎదురైన కుటుంబ ద్రోహం, ఆస్తి వివాదాలు, ఆర్థిక కష్టాలు, అనారోగ్యం, నమ్మకద్రోహం వంటి సంఘటనలు నన్ను ఎంతగా ప్రభావితం చేశాయో ఈ వ్యాసంలో పంచుకుంటున్నాను. ఇది ఎవరి మీదా ద్వేషంతో రాసిన కథ కాదు; కష్టకాలంలో తీసుకున్న నిర్ణయాలు, వాటి పరిణామాలు, వాటి నుంచి నేర్చుకున్న జీవిత పాఠాలు మరొకరికి ఉపయోగపడతాయనే ఆశతో ఈ అనుభవాలను పంచుకుంటున్నాను.
2003లో నా జీవితాన్ని శాశ్వతంగా మార్చిన సంఘటన
మా నాన్నగారు పొలంలో పని చేస్తుండగా అకస్మాత్తుగా స్పృహ తప్పి, బెల్లం తయారుచేసే కడాయిలో పడిపోవడంతో ప్రాణాలు కోల్పోయారు. ఆ దుర్ఘటనతో మా కుటుంబం ఒక్కసారిగా దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయింది.
అదే సమయంలో మా చిన్న చెల్లి వివాహం కూడా నిశ్చయమైనది. ఆ పరిస్థితుల్లో ఆమె పెళ్లికి అవసరమైన ఆర్థిక సహాయం కోసం బంధువులను, పరిచయస్తులను ఎంతో వేడుకున్నాం. కానీ ఎవ్వరూ ముందుకు రాలేదు.
చివరికి, మా కుటుంబానికి చెందిన ఒక పెద్ద వ్యక్తి వద్ద నా వారసత్వ ఆస్తిలో కొంత భాగాన్ని తనఖా పెట్టి ముప్పై వేల రూపాయలు అప్పుగా తీసుకోవాల్సి వచ్చింది. ఒక సంవత్సరం గడువుతో తెల్ల కాగితంపై ఒక ఒప్పందం రాసుకున్నారు.
కానీ, ఆ గడువు పూర్తికాకముందే, మా ప్రమేయం లేకుండా, మాకు తెలియకుండానే ఆయన ఆ ఆస్తిని తన పేరుమీదకు మార్చుకున్నారు. అప్పటికే రెవెన్యూ రికార్డులు డిజిటలైజేషన్ కావడంతో చట్టపరంగా దాన్ని తిరిగి పొందడం అసాధ్యమైంది.
ఈ విషయం తెలిసిన తర్వాత, మేము తీసుకున్న మొత్తానికి రెట్టింపు డబ్బు చెల్లించడానికి కూడా సిద్ధమని ఎంతో ప్రాధేయపడ్డాం. కానీ ఆయన తన మనస్సు మార్చుకోలేదు.
మా కుటుంబానికి జీవనాధారమైన అదే ఆస్తి ఆయనకు సంపదను తెచ్చిపెట్టింది; మమ్మల్ని మాత్రం మరింత పేదరికంలోకి నెట్టింది.
అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే, ఆయన మరెవరో కాదు, మా నాన్నగారి సొంత తమ్ముడు. కుటుంబ గౌరవం దెబ్బతినకూడదనే ఉద్దేశంతో, నా బాల్యంలో అతని భుజాలపై ఆడుకున్నాననే జ్ఞాపకం మనసులో ఉండటంతో, ఈ విషయాన్ని బయటకు తీసుకెళ్లకుండా మౌనంగా భరించాను.
చిన్న వయసులోనే ఆ సంఘటన నా మనసులో చెరగని గాయాన్ని మిగిల్చింది. చిన్నవారు తప్పు చేస్తే పెద్దలు దారి చూపుతారు. కానీ పెద్దలే తప్పు చేస్తే, చిన్నవారు ఎవరిని ఆశ్రయించాలి?
ఇంత జరిగినప్పటికీ, కుటుంబ బంధాలకు విలువ ఇస్తూ మేము ఆయనను గౌరవించడం మాత్రం ఆపలేదు. మనసులో ఎంత కోపం ఉన్నా, ఎక్కడో ఒక భావం ఆయనను తిట్టడానికి ఒప్పుకోనివ్వదు.
అయితే, ఆ సంఘటన నాకు ఒక జీవిత సత్యాన్ని నేర్పింది: కొన్ని గాయాలు శరీరంపై కనిపించవు; అవి జీవితాంతం మనసులోనే మిగిలిపోతాయి.
2017లో మరోసారి జీవితం పరీక్షించింది
మా అమ్మ తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో వైద్య ఖర్చుల కోసం మిగిలిన ఆస్తిని మరొకరికి కౌలుకు ఇచ్చి కొంత డబ్బు తీసుకోవాల్సి వచ్చింది. కానీ అక్కడ కూడా నిరాశే ఎదురైంది. కేవలం రెండు సంవత్సరాలకే, తప్పు లెక్కలతో చక్రవడ్డీ వేసి ఇచ్చిన మొత్తానికి ఆరు రెట్లు వసూలు చేయడమే కాకుండా, కౌలు కాలాన్ని కూడా ఏకపక్షంగా మరికొన్ని సంవత్సరాలు పొడిగించారు.
మా అవసర సమయంలో సహాయం చేశారనే భావనతో ఎక్కువగా వాదించడం ఇష్టం లేక, వారు అడిగినంత డబ్బు చెల్లించాను. కొన్ని సందర్భాల్లో మన మౌనం కూడా మనకు పెద్ద నష్టంగా మారుతుంది అనే విషయం దీనివల్ల అర్థమైంది
ఆ పరిస్థితుల్లో ఎంతోమందిని సహాయం కోసం ఆశ్రయించాను. ప్రముఖ క్రౌడ్‌ఫండింగ్ సైట్లు, దాతలను కూడా సంప్రదించాను. అయినా ఎలాంటి సహాయం అందలేదు. చివరకు ఆన్‌లైన్ రుణాలను ఆశ్రయించాల్సి వచ్చింది. అదే నిర్ణయం నా జీవితాన్ని పూర్తిగా తలకిందులు చేసింది.
మా అమ్మ క్యాన్సర్‌తో మరణించింది. ఆమె అంత్యక్రియల రోజే, మా పరిస్థితిని ఎంత వివరించినా పట్టించుకోకుండా ఒకరు బకాయి డబ్బును వసూలు చేశారు. ఆ రోజు నా తల్లి అంత్యక్రియలకు అవసరమైన ఖర్చు చేయడానికి కూడా నా చేతిలో డబ్బు మిగలలేదు. ఆ క్షణంలో నేను అనుభవించిన నిస్సహాయతను మాటల్లో చెప్పలేను. ఆ రోజు జ్ఞాపకం ఇప్పటికీ నా మనసులో చెరగని ముద్రగా నిలిచిపోయింది.
అమ్మ మరణం తర్వాత మా ఆర్థిక పరిస్థితి మరింత దిగజారడంతో, మూడు నెలల పాటు ఈఎంఐలను సమయానికి చెల్లించలేకపోయాను. దాంతో వరుస ఫోన్ కాల్స్, అవమానాలు, బెదిరింపులు, మానసిక వేధింపులు మొదలై, నేను భరించగలిగే హద్దులను దాటిపోయాయి.
ఆ సంఘటన గుర్తుకొచ్చిన ప్రతిసారి మనవత్వానికంటే డబ్బే విలువైనదా? అనే ప్రశ్న నన్ను వెంటాడుతూనే ఉంటుంది.
2022లో మరోసారి నమ్మకం ఛిన్నాభిన్నమైంది
ఆస్తిని కొనుగోలు చేసిన వ్యక్తి రిజిస్ట్రేషన్ పూర్తయ్యే వరకు నమ్మకంగా ప్రవర్తించి, చివర్లో చెల్లించాల్సిన పెద్ద మొత్తాన్ని చెక్కు రూపంలో ఇచ్చాడు. అతన్ని నమ్మి తీసుకున్న ఆ చెక్కు బౌన్స్ అయింది.
తర్వాత ఆ డబ్బు కోసం మర్యాదపూర్వకంగా ఎన్నిసార్లు అడిగినా ఎలాంటి స్పందన లేక, చివరికి చట్టాన్ని ఆశ్రయించక తప్పలేదు. కానీ అక్కడ కూడా నాకు న్యాయం దక్కలేదు.
చాలా బాధగా అనిపించే విషయం ఏమిటంటే, నా తరఫున వాదించిన, సన్నిహితుడైన న్యాయవాది కూడా ఆ కేసు విచారణను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేశారు. తరువాత ఆయన ఎదుటివారితో కుమ్మక్కయ్యారని తెలుసుకున్నాను.
ఆ ఆలస్యం కారణంగా చెక్ బౌన్స్ కేసు పరిమితి గడువు ముగిసిపోయింది. దాంతో రావలసిన డబ్బు అందలేదు. ఆ న్యాయవాదిపై ఉంచిన నమ్మకం కూడా అలా కూలిపోయింది. చివరికి ఆ డబ్బు ఆశనే వదులుకోవాల్సి వచ్చింది.
ఈ సంఘటన నా జీవితంలో మరో తీవ్రమైన మానసిక ఆఘాతంగా మిగిలిపోయింది. ప్రతి మోసం నా ఆర్థిక స్థితినే కాదు, మనుషులపై ఉన్న నా నమ్మకాన్ని కూడా క్రమంగా దెబ్బతీసింది.
ఈ వరుస సంఘటనలన్నీ నన్ను మానసికంగా పూర్తిగా కుంగదీశాయి. తీవ్రమైన ఒత్తిడి కారణంగా హైపర్‌టెన్షన్‌కు గురయ్యాను. ఇప్పుడు రోజువారీ చిన్న ఒత్తిడి కూడా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వైద్యుల సూచన మేరకు జీవితాంతం మందులు వాడాల్సిన పరిస్థితి వచ్చింది.
కొన్ని సందర్భాల్లో ఆ మందులు కొనడానికి కూడా డబ్బు ఉండదు. ఏది ఏమైనా, వాటిని ఒక్కరోజు కూడా మానకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు నా పరిస్థితి—డబ్బు లేకపోతే మందులు కొనలేను; మందులు కొనలేకపోతే ప్రాణమే లేదు అన్నట్టుగా మారింది.
ఇంతలో మా కుటుంబంలో నాకు అత్యంత ప్రియమైన ఒక వ్యక్తికి అత్యవసర శస్త్రచికిత్స అవసరమైంది. నేను ఆస్తి అమ్మినప్పుడు రావాల్సిన డబ్బు సమయానికి వచ్చి ఉంటే, అప్పట్లో ఆ శస్త్రచికిత్స సుమారు నలభై వేల రూపాయల ఖర్చుతోనే పూర్తయ్యేది.
కానీ ఆ డబ్బు అందకపోవడంతో చికిత్సను వాయిదా వేయాల్సి వచ్చింది. చికిత్స ఆలస్యమవడంతో ఆరోగ్య సమస్య మరింత తీవ్రమైంది. ప్రస్తుతం అదే శస్త్రచికిత్సకు దాదాపు పన్నెండు లక్షల రూపాయలు ఖర్చవుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇంకా ఆలస్యం చేస్తే ప్రాణాపాయంతో పాటు క్యాన్సర్ వంటి తీవ్రమైన సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని కూడా హెచ్చరిస్తున్నారు. దీంతో, గోటితో పోయేది గొడ్డలి వరకు వచ్చినట్టే పరిస్థితి నెలకొంది.
నా కళ్లముందే ఆ వ్యక్తి ప్రతిరోజూ అనుభవిస్తున్న బాధను చూడలేకపోతున్నాను. ఒకప్పుడు ఇష్టంగా తినే ఆహారాన్ని ఇప్పుడు తినలేకపోతున్నారు. ప్రతిరోజూ దాదాపు ద్రవాహారంపైనే జీవిస్తున్నారు. చాలా సార్లు అన్నంలో నీళ్లు పోసుకుని తినడం, లేదా అన్నం–సాంబారు–కూర అన్నింటినీ మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకుని తినడం చూస్తున్నప్పుడల్లా నా మనసు తీవ్రంగా కలచివేస్తోంది.
ఏ వేడుకకు వెళ్లినా, ఎంత ఆకలిగా ఉన్నా కడుపునిండా తినలేక బాధపడుతున్నారు. చివరకు పండ్లను కూడా తినలేని స్థితికి చేరుకున్నారు.
నేను మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నీ తినగలుగుతున్నాను. కానీ నాపై ఆధారపడిన ఆ వ్యక్తి ఏదైనా తినాల్సినప్పుడల్లా అనుభవించే బాధను చూస్తుంటే, నన్ను నేనే అసహ్యించుకునేంత బాధ కలుగుతుంది.
"సకాలంలో చికిత్స చేయించే స్తోమత కూడా లేని ఈ జీవితం నీకెందుకు?" అని నా అంతరాత్మ నన్నే ప్రశ్నిస్తూ ఉంటుంది.
దయతో చేసిన సహాయం మరో పోరాటంగా మారింది
మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా కుటుంబం పూర్తిగా దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయింది. నేను కూడా ఉద్యోగం కారణంగా ఇంటికి దూరంగా ఉండటంతో మా వంశపారంపర్య భూములను సరిగా చూసుకోలేకపోయాను.
ఆ సమయంలో జీవనాధారం లేని ఒక వ్యక్తిపై జాలిపడి, మా భూమిని ఉచితంగా సాగు చేసుకోవడానికి ఇచ్చాం. కానీ మా నమ్మకాన్ని వారు అవకాశంగా మార్చుకున్నారు. కొంతకాలానికే ఆ భూమిని పూర్తిగా ఆక్రమించుకుని, తమదేనని చెప్పడం ప్రారంభించారు.
ఆ భూమి నా వంశపారంపర్య ఆస్తి. రెవెన్యూ రికార్డులు అన్నీ నా పేరుమీదే ఉన్నాయి. చట్టపరంగా కూడా నేనే యజమానిని. అయినప్పటికీ నన్నే నా భూమిలోకి అడుగుపెట్టనీయకుండా అడ్డుకుంటున్నారు. మర్యాదపూర్వకంగా ఎన్నిసార్లు మాట్లాడినా ప్రయోజనం లేకపోయింది. ఆధారాలు లేకపోయినా ఆ ఆస్తిని తమ పేరుపై రిజిస్ట్రేషన్ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు.
అంతటితో ఆగలేదు. అంగీకరించకపోతే ప్రాణహాని కలిగించేలా బెదిరింపులు కూడా ఎదురయ్యాయి. నా ఆస్తిపైనే జీవనం సాగిస్తూ, అదే ఆస్తిని నాకే దూరం చేయడానికి ప్రయత్నించడం నా జీవితంలో మరో చేదు అనుభవంగా మారింది.
పరిష్కారం కోసం చట్టాన్ని ఆశ్రయించాను. కానీ అక్కడ కూడా ఆశించిన న్యాయం లభించలేదు. న్యాయం దక్కుతుందనే ఆశతో కేసు నిర్వహణకు అవసరమైన ఫీజులను దశలవారీగా చెల్లించాను. ఆ ఖర్చుల కోసం అధిక వడ్డీకి అప్పులు కూడా తీసుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ కాలమే గడిచింది తప్ప, సమస్య మాత్రం అలాగే మిగిలిపోయింది.
ఇక్కడ, కొందరు న్యాయవాదుల ప్రవర్తన నన్ను తీవ్రంగా నిరాశపరిచింది. ఒక న్యాయవాది నాతో, "నీ ఆస్తిని నా పేరుమీద రిజిస్ట్రేషన్ చేసి, నేను అడిగినంత ఫీజు ఇస్తే నీ పని జరుగుతుంది" అనడం ఏ చట్టం ప్రకారం ఇచ్చిన సలహానో నాకు అర్థం కాలేదు.
ఒకవైపు అప్పుల భారం, మరోవైపు నా సొంత ఆస్తిపైనే పోరాటం. మానసికంగా కుంగిపోతూ, ఆర్థికంగా నలిగిపోతూ, నా ఆరోగ్యాన్ని కూడా కోల్పోతున్నాను. ఈ పోరాటానికి ముగింపు ఎప్పుడు వస్తుందో ఇప్పటికీ నాకు తెలియటం లేదు.
ఈ మిగిలిన ఆస్తే చివరకు మా కుటుంబానికి ఉన్న ఏకైక జీవనాధారం. దీనివల్లే కొంత ఆదాయం కూడా వస్తోంది. ఒకవేళ ఈ ఆస్తిని కూడా కోల్పోతే, మా కుటుంబం ఆర్థికంగా మళ్లీ శూన్యం నుంచి జీవితాన్ని ప్రారంభించాల్సిన పరిస్థితి వస్తుంది.
ఎలాంటి పరిస్థితుల్లోనూ ఈ ఆస్తిని వదులుకోకూడదని నా కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. కానీ నా అంతరాత్మ మాత్రం మరో ప్రశ్నను నా ముందుంచుతోంది. ఈ అంతులేని పోరాటానికి ముగింపు పలకడానికి, దీన్ని దానంగా ఇచ్చినట్టుగా భావించి వదిలేయడమే సరైన పరిష్కారమేమో అనే ఆలోచన నన్ను వేధిస్తోంది.
ఒకవేళ ఈ నిర్ణయం తీసుకుంటే, కనీసం ఎన్నేళ్లుగా వెంటాడుతున్న మానసిక ఒత్తిడి నుంచి విముక్తి లభించవచ్చు. మిగిలిన జీవితాన్ని కొంత ప్రశాంతంగా గడపగలనేమో అనిపిస్తోంది. కానీ మరోవైపు, పోరాడలేని వ్యక్తిగా సమాజం నన్ను చూసే అవకాశం కూడా ఉంది. అంతేకాదు, భవిష్యత్తులో నేను లేకపోయినా, ప్రస్తుతం నేను ఎదుర్కొంటున్న ఇదే సమస్య నా కుటుంబాన్ని కూడా వెంటాడే ప్రమాదం ఉంది.
కొన్నిసార్లు ఈ సమస్యకు మరో పరిష్కారం ఉండొచ్చేమో అనే ఆలోచన కూడా వస్తుంది. వారికి చివరికి కావలసింది ఆస్తి కాదు, దాని విలువైన డబ్బే అయితే, ఆ ఆస్తికి సమానమైన మొత్తాన్ని ఇచ్చి ఈ సమస్యకు ముగింపు పలకగలమా అనే ఆలోచన కూడా కలుగుతుంది. కానీ రోజువారీ జీవనం, ఆరోగ్య సమస్యలు, అప్పుల భారం మధ్య అలాంటి నిర్ణయం తీసుకునే ఆర్థిక స్థోమత కూడా మా వద్ద లేదు.
అందుకే ఈరోజు నేను రెండు మార్గాల కూడలిలో నిలబడ్డాను. ఒక మార్గం నా మనసుకు ప్రశాంతతను ఇవ్వొచ్చు. మరో మార్గం నా కుటుంబానికి భవిష్యత్తును కాపాడవచ్చు. ఈ రెండింటిలో ఏది సరైనదో ఇప్పటికీ నాకు సమాధానం దొరకడం లేదు.
ఈ ప్రయాణం మిగిల్చిన పాఠం
దయతో తీసుకున్న నిర్ణయాలు, తగిన జాగ్రత్త లేకపోతే జీవితాంతం మోయాల్సిన భారంగా మారవచ్చు. అలాగే, కష్టకాలంలో ప్రతి ఒక్కరూ మనతో ఉండరని, కొన్నిసార్లు అత్యంత సన్నిహితులే మానని గాయాలను మిగులుస్తారని ఈ అనుభవం నేర్పింది.
అయినప్పటికీ, ఈ అనుభవాన్ని నేను ఎవరి పట్ల ద్వేషంతో రాయడం లేదు. నా అనుభవం మరొకరికి ఒక చిన్న హెచ్చరికగా లేదా జీవితపాఠంగా నిలిస్తే చాలు అనుకుంటున్నాను. అప్పుడు నా అనుభవానికే ఒక అర్థం దొరికినట్లే.
చివరికి మిగిలింది అలసిపోయిన మనసే
జీవితంలో వరుసగా ఎదురైన మోసాలు, అనారోగ్యాలు, అప్పులు, అవమానాలు, భయాలు, నమ్మకద్రోహాలు... ఇవన్నీ కలిసి ఈరోజు నన్ను పూర్తిగా అలసిపోయిన మనిషిగా మార్చేశాయి.
ఈరోజు నన్ను ఎక్కువగా వేధిస్తున్నది ఆస్తి గురించో, డబ్బు గురించో కాదు. నాకు మనశ్శాంతిని ఇచ్చే మార్గాన్ని కనుగొనడమే.
నేను తీసుకునే నిర్ణయం వల్ల నా కుటుంబం నష్టపోతే, అది సరైన నిర్ణయమా? మరోవైపు, ఈ పోరాటాన్ని కొనసాగిస్తూ నా జీవితాన్నే కోల్పోతే, అది సరైనదా? ఈ రెండు ప్రశ్నల మధ్యే ప్రతి రోజూ నేను నిశ్శబ్దంగా పోరాడుతున్నాను.
బహుశా నేను చూడలేని మరో కోణం మీకు కనిపించవచ్చేమో. నేను ఆలోచించని ఒక పరిష్కారం మీకు తోచవచ్చేమో.
మీరు నా స్థానంలో ఉంటే... ఏ నిర్ణయం తీసుకునేవారు?
