ఒత్తిడిని తగ్గించడంలో నాడీ వ్యవస్థపై యోగా ఎలా ప్రభావం చూపిస్తుంది?

రోజంతా ఒత్తిడితో గడిపి, చివరకు ఇంటికి చేరుకుంటారు. సోఫాలో కాసేపు వాలుతారు. ఇక ఈరోజు హడావుడి అంతా అయిపోయింది, ఇప్పుడు కాస్త హాయిగా ఉండొచ్చనుకుంటారు.

కానీ మనసు అంత త్వరగా ఆ ఒత్తిడి నుంచి బయటపడదు. ఆ రోజు జరిగిన చిన్న విషయం ఏదైనా మళ్లీ మళ్లీ గుర్తుకొస్తూనే ఉంటుంది. ఒళ్లంతా ఇంకా బిగుసుకుపోయినట్టే అనిపిస్తుంది. ఏదైనా మెసేజ్ వచ్చిందేమోనని మరోసారి ఫోన్‌ చూస్తారు. ఫోన్‌ పక్కన పెట్టినా, ఆలోచనల హోరు మాత్రం ఆగదు. ఒళ్లు అలసిపోయినా, శరీరానికి గానీ మనసుకు గానీ పూర్తిగా సేదతీరినట్టు అనిపించదు.

ఇలాంటి అనుభవం మనలో చాలామందికి ఎదురయ్యేదే. ఎందుకంటే ఒత్తిడి కేవలం మనసుకే పరిమితం కాదు — అది మన శ్వాసలో, గుండె చప్పుళ్లలో, కండరాలు బిగుసుకోవడంలో, జీర్ణక్రియలో, నిద్రలో, రోజువారీ శక్తి స్థాయిల్లో కూడా ప్రభావం చూపవచ్చు. ఇక్కడే యోగా, ఒత్తిడి, నాడీ వ్యవస్థల మధ్య ఉన్న సంబంధం ఆసక్తికరంగా మారుతుంది.

యోగా “నాడీ వ్యవస్థను రీసెట్ చేస్తుంది”, “ఒత్తిడిని పూర్తిగా తగ్గిస్తుంది”, “మెదడును రీవైర్ చేస్తుంది” వంటి గట్టి వాదనలు ఆన్‌లైన్‌లో కనిపిస్తుంటాయి. అయితే, పరిశోధనలు ఒక విషయం చెబుతుంటే, కొన్ని ఆన్‌లైన్‌ హెడ్‌లైన్లు దాన్ని మరింత పెద్దదిగా చూపిస్తాయి.

కాబట్టి, యోగా గురించి పరిశోధనలు అసలు ఏం చెబుతున్నాయో చూద్దాం.

నాడీ వ్యవస్థ ఒక స్విచ్‌లా పనిచేయదు

యోగా గురించి మాట్లాడే ముందు, మన నాడీ వ్యవస్థ అసలు ఏం చేస్తుందో కొంచెం తెలుసుకుందాం.

మన చుట్టూ ఏం జరుగుతుందో, మన శరీరంలో ఏం జరుగుతుందో నాడీ వ్యవస్థ ఎప్పటికప్పుడు గుర్తిస్తూ ఉంటుంది. దానికి తగ్గట్టుగా మన శరీరం ఎలా స్పందించాలో కూడా అది నియంత్రిస్తుంది.

మన గుండె కొట్టుకోవాలని మనం ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. జీర్ణక్రియ జరగాలని కూడా మనం చెప్పాల్సిన పని లేదు. మనకు తెలియకుండానే జరిగే ఇలాంటి ఎన్నో పనులను నియంత్రించడంలో ఆటోనామిక్ నాడీ వ్యవస్థ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది గుండె వేగం, శ్వాస, జీర్ణక్రియ వంటి అనేక శరీర ప్రక్రియలను నియంత్రిస్తుంది.

ఆటోనామిక్ నాడీ వ్యవస్థలో సింపథటిక్ మరియు పారాసింపథటిక్ అనే రెండు ముఖ్యమైన విభాగాలు ఉన్నాయి. వీటితో పాటు జీర్ణవ్యవస్థకు సంబంధించిన ఎంటెరిక్ నాడీ వ్యవస్థ కూడా ఉంటుంది.

సింపథటిక్ వ్యవస్థ శరీరాన్ని మరింత అప్రమత్తంగా చేసి, అవసరమైనప్పుడు త్వరగా స్పందించడానికి సిద్ధం చేస్తుంది. పారాసింపథటిక్ వ్యవస్థ విశ్రాంతి, జీర్ణక్రియ వంటి పనులకు ఎక్కువగా తోడ్పడుతుంది. అందుకే వీటిని సులభంగా అర్థం చేసుకోవడానికి “ఫైట్ ఆర్ ఫ్లైట్”, “రెస్ట్ అండ్ డైజెస్ట్” అనే మాటలు వాడుతుంటారు.

అయితే, ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి.

సింపథటిక్ వ్యవస్థ పనిచేస్తే పారాసింపథటిక్ వ్యవస్థ పూర్తిగా ఆగిపోదు. చాలా సందర్భాల్లో రెండూ ఒకేసారి పనిచేస్తూనే ఉంటాయి — ఏ సమయంలో దేనికి ఎంత ప్రాధాన్యం ఉందో మాత్రం పరిస్థితిని బట్టి మారుతుంది.

ఉదాహరణకు, మీరు వ్యాయామం చేస్తున్నప్పుడు గుండె వేగంగా కొట్టుకోవడం సహజమే.

నిద్రపోతున్నప్పుడు శరీరం వేరే విధంగా పనిచేస్తుంది.

భయపడినప్పుడు శరీరం మరింత అప్రమత్తంగా మారుతుంది.

ప్రమాదం దాటిపోయాక, శరీరం క్రమంగా మళ్లీ సాధారణ స్థితికి వస్తుంది.

అందుకే ఆరోగ్యకరమైన నాడీ వ్యవస్థ అంటే ఎప్పుడూ ప్రశాంతంగా ఉండటం కాదు. పరిస్థితిని బట్టి స్పందించి, పరిస్థితి మారినప్పుడు మళ్లీ సర్దుకుపోగలగడం ముఖ్యం.

ఒత్తిడి తగ్గిపోయినా శరీరం ఎందుకు వెంటనే సాధారణ స్థితికి రాదు?

ఒక సాధారణ ఉదాహరణ తీసుకుందాం. మీ మేనేజర్‌ హఠాత్తుగా, “ఈరోజు ముగిసేలోపు ఈ పని పూర్తి చేసి ఇవ్వాలి” అని చెబుతారు.

ఆ మాట వినగానే మీ మెదడు ఆ పరిస్థితిని ఒక సవాలుగా గుర్తిస్తుంది. మీరు ఒక్కసారిగా అప్రమత్తమవుతారు. గుండె వేగంగా కొట్టుకోవచ్చు; శ్వాస వేగంగా మారవచ్చు. అదే సమయంలో, ఒత్తిడికి శరీరం స్పందించే హార్మోన్ల వ్యవస్థలు కూడా పనిచేయడం మొదలుపెడతాయి. ఇది శరీరం సవాలును ఎదుర్కోవడానికి సిద్ధమయ్యే సహజ స్పందన.

నిజంగా ఏదైనా సవాలును ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఈ స్పందన ఉపయోగపడుతుంది. ఆ పని పూర్తయి, ఒత్తిడి తగ్గిన తర్వాత శరీరం క్రమంగా తన సాధారణ స్థితికి చేరుకుంటుంది.

కానీ రోజువారీ జీవితంలో ఒత్తిడి ఎప్పుడూ ఒక్క సంఘటనతోనే ముగియదు.

కొంతసేపు డబ్బు గురించి ఆలోచిస్తారు. వెంటనే పని గుర్తుకొస్తుంది. ఆ తర్వాత ఇంట్లోని సమస్యలు గుర్తొస్తాయి. కాసేపటికి సోషల్‌ మీడియాలో ఏదో కలవరపెట్టే విషయం కనిపిస్తుంది. రాత్రి మంచంపై పడుకున్నాక కూడా మరుసటి రోజు గురించి ఆలోచనలు మొదలవుతాయి.

ఇలా చిన్న చిన్న ఒత్తిళ్లు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటే, వాటి మధ్యలో శరీరానికి పూర్తిగా తేరుకునే సమయం చాలాసార్లు దొరకదు. ఒక ఒత్తిడి తగ్గేలోపే మరోటి మొదలవుతుంది.

అందుకే, ఒత్తిడి తగ్గిపోయిన వెంటనే శరీరం ఒక్కసారిగా పూర్తిగా సాధారణ స్థితికి వచ్చేయాల్సిన అవసరం లేదు. శరీరం తన సహజ స్థితికి క్రమంగా తిరిగి వస్తుంది. అయితే ఒత్తిడి తరచూ ఎదురవుతుంటే, ఆ మధ్యలో దొరికే విశ్రాంతి కూడా తగ్గిపోవచ్చు.

ఇలాంటి పరిస్థితుల్లో యోగా శరీరం ఒత్తిడికి స్పందించే తీరుపై ఏమైనా ప్రభావం చూపుతుందా అనేది పరిశోధకులు పరిశీలించిన ప్రశ్న.

యోగా అంటే కేవలం శరీరాన్ని సాగదీయడం మాత్రమే కాదు

యోగా అనే మాట వినగానే చాలామందికి కష్టమైన ఆసనం వేస్తున్న వ్యక్తే గుర్తుకొస్తారు. కానీ యోగా అంటే కేవలం శరీరాన్ని సాగదీయడం మాత్రమే కాదు. చేసే విధానాన్ని బట్టి ఇందులో ఆసనాలతో పాటు శ్వాసాభ్యాసాలు, ఏకాగ్రత, ధ్యానం, విశ్రాంతి వంటి అంశాలు కూడా ఉంటాయి.

నేషనల్ సెంటర్ ఫర్ కాంప్లిమెంటరీ అండ్ ఇంటిగ్రేటివ్ హెల్త్ (NCCIH) ప్రకారం, యోగాలో సాధారణంగా ఆసనాలు, శ్వాసాభ్యాసాలు, ధ్యానం ఉంటాయి. అయితే యోగా పద్ధతులు ఒకేలా ఉండవు; ఇందులో అనేక రకాల విధానాలు ఉన్నాయి. కొన్ని నెమ్మదిగా, ప్రశాంతంగా సాగితే, మరికొన్ని ఎక్కువ శారీరక శ్రమతో కూడి ఉంటాయి.

ఈ తేడాను గుర్తుంచుకోవడం ముఖ్యం. నెమ్మదిగా చేసే యోగా సెషన్‌కి, ఎక్కువ శారీరక శ్రమ ఉండే యోగా క్లాస్‌కి ఒకేలా ఉండవు.

అందుకే, “యోగా నాడీ వ్యవస్థను ప్రశాంతంగా ఉంచుతుందని పరిశోధనలు నిరూపించాయి” అనే వాక్యాన్ని చదివినప్పుడు కొన్ని విషయాలను పరిశీలించాలి: ఏ రకమైన యోగా చేశారు? ఆ పరిశోధనలో ఎలాంటి వ్యక్తులను తీసుకున్నారు? ఎంతకాలం చేశారు? దేనితో పోల్చి చూశారు?

ఇలాంటి వివరాలు తెలుసుకున్నప్పుడే, యోగా గురించి వచ్చిన పరిశోధన ఫలితాలు అసలు ఏం చెబుతున్నాయో సరిగ్గా అర్థం చేసుకోగలం.

శ్వాస, ఒత్తిడి మధ్య సంబంధం

యోగా అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది వివిధ ఆసనాలే కావచ్చు. కానీ యోగా సాధనలో ఆసనాలతో పాటు మరో ముఖ్యమైన భాగం శ్వాస.

రోజంతా మనకు తెలియకుండానే శ్వాస తీసుకుంటూనే ఉంటాం. అయితే గుండె కొట్టుకోవడం లాగా కాకుండా, శ్వాసను మనం కావాలనే నెమ్మదించవచ్చు. దాని వేగాన్ని మార్చవచ్చు. శ్వాస ఎలా సాగుతుందో గమనించవచ్చు.

యోగాలో ప్రాణాయామం వంటి నియంత్రిత శ్వాసాభ్యాసాలకు శతాబ్దాలుగా స్థానం ఉంది. ఈ శ్వాసాభ్యాసాలు ఒత్తిడి, ఏకాగ్రత, గుండె పనితీరుపై ఎలా ప్రభావం చూపవచ్చో పరిశోధిస్తున్నారు.

శ్వాస ఎందుకు ముఖ్యమో ఒక చిన్న ఉదాహరణ చూద్దాం.

మీరు హడావుడిగా ఏదైనా పని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీ శ్వాస ఎలా ఉంటుందో గమనించండి. ఇప్పుడు కాసేపు ఆగి, ప్రశాంతంగా కూర్చుని, నెమ్మదిగా సౌకర్యంగా శ్వాస తీసుకోండి. అప్పుడెలా అనిపిస్తుందో గమనించండి.

ఇక్కడ తేడా కేవలం ఊపిరితిత్తుల్లోనే ఉండదు.

మన శ్వాసను కావాలనే నెమ్మదించినప్పుడు, కాసేపు ఆగి శ్వాసపై దృష్టి పెట్టే అవకాశం కూడా దొరుకుతుంది. అప్పటివరకు చేస్తున్న పని నుంచి, మనసులో తిరుగుతున్న ఆలోచనల నుంచి, కొద్దిసేపైనా దూరంగా ఉండగలుగుతాం.

అయితే, నెమ్మదిగా శ్వాస తీసుకోవడం వల్ల ఒత్తిడికి శరీరం ఇచ్చే స్పందన వెంటనే ఆగిపోతుందని దీని అర్థం కాదు. నెమ్మదిగా, లోతుగా శ్వాస తీసుకునే పద్ధతులు ఒత్తిడి తగ్గడంలో, అలాగే గుండె స్పందన వంటి కొన్ని శారీరక మార్పులపై ప్రభావం చూపవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి.

అందుకే, శ్వాసలో చేసే ఇలాంటి మార్పులు ఒత్తిడికి శరీరం ఎలా స్పందిస్తుందో తెలుసుకోవడంలో ఎంతవరకు సహాయపడతాయో పరిశోధకులు పరిశీలిస్తున్నారు.

HRV అంటే ఏమిటి? దీని గురించి ఇంతగా ఎందుకు మాట్లాడుతున్నారు?

యోగా, నాడీ వ్యవస్థ గురించి వెతికితే, ఇంకో పదం మీకు కనిపిస్తుంది: HRV — హార్ట్ రేట్ వేరియబిలిటీ.

ఈ పేరు కొంచెం క్లిష్టంగా అనిపించొచ్చు. కానీ విషయం చాలా సులభం.

మన గుండె కొట్టుకునే మధ్య సమయం ప్రతిసారీ సరిగ్గా ఒకేలా ఉండదు. ఒక గుండె చప్పుడు నుంచి తర్వాతి గుండె చప్పుడు వరకు ఉండే సమయాల్లో కనిపించే ఈ చిన్న చిన్న తేడాలనే HRV అంటారు.

మన గుండెను ఆటోనామిక్ నాడీ వ్యవస్థ ఎలా నియంత్రిస్తుందో అర్థం చేసుకోవడానికి HRVను ఒక పరోక్ష సూచికగా ఉపయోగిస్తారు.

యోగాపై జరిగిన కొన్ని పరిశోధనల్లో HRVలో మార్పులు కనిపించాయి. కానీ ఆ పరిశోధనల్లో చాలావరకు పాల్గొన్న వారి సంఖ్య తక్కువగా ఉండటం, అధ్యయనాల పద్ధతుల్లో తేడాలు ఉండటం వల్ల, యోగా HRVను పెంచుతుందని ఖచ్చితంగా చెప్పడానికి ప్రస్తుతం ఆధారాలు సరిపోవు.

అందుకే, “యోగా HRVను పెంచుతుంది. కాబట్టి యోగా నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా చేస్తుంది” అని నేరుగా తేల్చేయడం సరైంది కాదు.

యోగా నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుందా?

బహుశా ప్రభావం ఉండొచ్చు — కానీ సోషల్‌ మీడియాలో కనిపించేంత సులభమైన విషయం మాత్రం కాదు.

ఒత్తిడి, ఆటోనామిక్ నాడీ వ్యవస్థ పనితీరుకు సంబంధించిన కొన్ని మార్పులపై యోగా ప్రభావం చూపవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. అయితే, యోగాలోని ఏ భాగం ఈ ప్రభావాలకు ఎంతవరకు కారణమవుతుందో ఇంకా పూర్తిగా అర్థం కాలేదు.

అది శరీర కదలికల వల్లనా? శ్వాసాభ్యాసాల వల్లనా? దృష్టిని ఒకచోట నిలిపి ఉంచడం వల్లనా? విశ్రాంతి వల్లనా? ధ్యానం వల్లనా? క్లాస్‌లో ఇతరులతో కలిసి చేసే అనుభవం వల్లనా? లేక ఇవన్నీ కలిసి పనిచేస్తున్నాయా?

బహుశా, ఇవన్నీ కలిసి పనిచేస్తుండొచ్చు.

యోగా గురించి ఆసక్తికరమైన విషయం కూడా ఇదే కావచ్చు. ఇందులో ఒక్క పని మాత్రమే చేయరు. కదులుతూనే దృష్టి పెడతారు. కదులుతూనే శ్వాసను గమనిస్తారు. కొన్నిసార్లు కదలికల తర్వాత కాసేపు ప్రశాంతంగా కూర్చుంటారు.

ఒత్తిడిపై తాజా పరిశోధనలు ఏం చెబుతున్నాయి?

ఒత్తిడిని అనుభవిస్తున్న పెద్దలపై యోగా ఎంతవరకు పనిచేస్తుందనే దాని గురించి 2024లో ఒక పెద్ద సమీక్ష జరిగింది. సుమారు 1,026 మందిపై జరిగిన 13 వేర్వేరు పరిశోధనల ఫలితాలను ఇందులో కలిపి విశ్లేషించారు.

యోగా కాకుండా ఇతర ప్రత్యేక చికిత్స తీసుకోని వారితో పోల్చితే, యోగా చేసిన వారిలో తక్కువ కాలంలోనే ఒత్తిడి తగ్గినట్లు ఈ ఫలితాలు చెబుతున్నాయి.

అయితే, ఈ పరిశోధనల్లోని ఆధారాలు అంత పక్కాగా లేవని పరిశోధకులు భావిస్తున్నారు. కాబట్టి, ఈ ఫలితాలు సానుకూలంగా ఉన్నప్పటికీ.. యోగా చేస్తే కచ్చితంగా ఒత్తిడి తగ్గిపోతుందని చెప్పడానికి ఇప్పుడున్న ఆధారాలు సరిపోవు. దీనిపై కచ్చితమైన నిర్ణయానికి రావాలంటే ఇంకా మెరుగైన పరిశోధనలు జరగాల్సి ఉంది.

యోగా 'వాగస్ నాడి'ని యాక్టివేట్ చేస్తుందనేది నిజమేనా?

వాగస్ నాడి అంటే ఏమిటి? శరీరంలో ఎక్కడ ఉంటుంది?

వాగస్ నాడి (Vagus Nerve) అనేది మెదడు కింది భాగం నుంచి మొదలై మెడ, ఛాతీ మీదుగా గుండె, ఊపిరితిత్తులు, జీర్ణవ్యవస్థలోని పలు అవయవాల వరకు సాగిపోయే ముఖ్యమైన నాడి. ఇది పారాసింపథటిక్ నాడీ వ్యవస్థలో ముఖ్యమైన పాత్ర పోషిస్తూ, హృదయ స్పందన, జీర్ణక్రియ వంటి మనకు తెలియకుండానే జరిగే కొన్ని శరీర అవయవాల పనులతో సంబంధం కలిగి ఉంటుంది.

వస్తున్న ప్రచారం

ఈ రోజుల్లో “యోగా చేయడం వల్ల వాగస్ నాడి యాక్టివేట్ అవుతుంది, నాడీ వ్యవస్థ రీసెట్ అవుతుంది” అనే మాట సోషల్ మీడియాలోనూ, హెల్త్ ఆర్టికల్స్‌లోనూ తరచూ వినిపిస్తోంది. కానీ ఈ వాదన వెనుక ఉన్న శాస్త్రీయ నిజమేంటి?

వాగస్ నాడి అసలు పనేంటి?

మన ప్రమేయం లేకుండా (అచేతనంగా) జరిగే గుండె స్పందన, జీర్ణక్రియ, ఊపిరి తీసుకోవడం వంటి పనులను పర్యవేక్షించే వ్యవస్థను 'పారాసింపథటిక్ నాడీ వ్యవస్థ' అంటారు. వాగస్ నాడి అందులో ప్రధాన భాగం. విశ్రాంతిగా ఉన్నప్పుడు శరీరం సాధారణ స్థితికి రావడానికి ఇది నిరంతరం సహాయపడుతూనే ఉంటుంది.

శాస్త్రీయ నిజం — యోగా నిజంగా ఏం చేస్తుంది?

మన ప్రమేయం లేకుండా జరిగే హృదయ స్పందన, జీర్ణక్రియ వంటి ఎన్నో శరీర పనులను నియంత్రించడంలో పారాసింపథటిక్ నాడీ వ్యవస్థ భాగం వహిస్తుంది. వాగస్ నాడి అందులో ముఖ్యమైన భాగం. విశ్రాంతి సమయంలో శరీర పనితీరును నియంత్రించడంలో కూడా ఇది పాత్ర పోషిస్తుంది.

అయితే, యోగా చేయడం వల్ల ఆగిపోయిన వాగస్ నాడి ఏదో స్విచ్ వేసినట్లు ఒకేసారి "యాక్టివేట్" అయిపోతుందనో, లేదా నాడీ వ్యవస్థ మొత్తం ఒక్క క్షణంలో "రీసెట్" అయిపోతుందనో చెప్పడం శాస్త్రీయంగా సరైనది కాదు (ఇది కేవలం ఒక అతిశయోక్తి).

సులభంగా చెప్పాలంటే—వాగస్ నాడి ఎప్పుడూ శరీరంలో పనిచేస్తూనే ఉంటుంది. యోగా మరియు శ్వాస వ్యాయామాలు దాని పనితీరును మరింత మెరుగుపరిచి, నాడీ వ్యవస్థను సమతుల్యంగా ఉంచడానికి సహాయపడతాయి. అంతే తప్ప యోగా అనేది నాడీ వ్యవస్థను రీసెట్ చేసే ఒక "మ్యాజిక్ స్విచ్" కాదు.

యోగా కార్టిసాల్‌ను తగ్గిస్తుందా?

వెల్‌నెస్‌ కంటెంట్‌లో కార్టిసాల్ అనే పదం కూడా తరచుగా కనిపిస్తుంది. “యోగా కార్టిసాల్‌ను తగ్గిస్తుంది” అనే మాట కూడా మీరు చాలాసార్లు చూసి ఉండవచ్చు.

అయితే, కార్టిసాల్‌ అంటే “చెడు స్ట్రెస్ కెమికల్” అని అనుకోవడం సరికాదు. మన శరీరానికి ఇది అవసరమైన హార్మోన్‌. జీవక్రియ, రోగనిరోధక వ్యవస్థ పనితీరు, ఒత్తిడికి శరీరం స్పందించడం వంటి వాటిలో ఇది పాత్ర పోషిస్తుంది.

అసలు ప్రశ్న ఏమిటంటే, యోగాలోని కొన్ని పద్ధతులు కార్టిసాల్‌ స్థాయిలను ప్రభావితం చేస్తాయా, అలా అయితే ఆ ప్రభావం ఎంతవరకు ఉంటుందనేది.

దీనిపై పరిశోధనలు జరిగాయి. కానీ అన్ని అధ్యయనాల్లోనూ ఒకే ఫలితం రాలేదు. ఏ విధంగా యోగా చేశారు, ఎంతకాలం సాధన చేశారు, పరిశోధనలో ఎలాంటి వ్యక్తులను తీసుకున్నారు, కార్టిసాల్‌ను ఎప్పుడు కొలిచారు వంటి విషయాల్లో తేడాలు ఉన్నాయి.

కొన్ని పరిశోధనల్లో కార్టిసాల్‌ తగ్గినట్లు కనిపించింది. అయినా, యోగా వల్ల కార్టిసాల్‌ ఖచ్చితంగా తగ్గుతుందని చెప్పడానికి ప్రస్తుతం ఆధారాలు సరిపోవు.

యోగా ప్రభావం కేవలం శారీరక మార్పులకే పరిమితం కాదు

యోగా వల్ల కలిగే ప్రభావం కేవలం శరీరంలో కనిపించే మార్పులతోనే ఆగిపోకపోవచ్చు. యోగా చేస్తున్నప్పుడు మన దృష్టి దేనిపై ఉందనేది కూడా ముఖ్యమే.

రోజంతా ఏదో ఒక పని... ఫోన్‌, ఈమెయిల్‌, ఆఫీస్‌ పని, మెసేజ్‌లు, వార్తలు, మీటింగ్‌లు, ట్రాఫిక్‌, ఇంటి పనులు... ఇలా మన దృష్టి ఒకదాని నుంచి మరోదానికి మారుతూనే ఉంటుంది.

అలాంటి హడావుడి రోజులో 20 నిమిషాలు యోగా చేస్తే, కాసేపు మన శ్వాస, శరీరంపై దృష్టి పెడతాం. శ్వాసను గమనిస్తాం. కాస్త నెమ్మదిగా ఉంటాం. ఫోన్‌ను కూడా పక్కన పెడతాం.

అంటే, ఆ 20 నిమిషాల్లో మన దృష్టి బయట జరుగుతున్న విషయాల నుంచి కాసేపు మన శరీరం వైపు మళ్లుతుంది. రోజంతా ఉండే హడావుడికి ఇది భిన్నమైన అనుభవం.

యోగా నాడీ వ్యవస్థను “రీసెట్” చేస్తుందని చెప్పాల్సిన అవసరం లేకుండానే, ఈ మార్పు ఎందుకు ముఖ్యమో అర్థమవుతుంది. చుట్టూ జరిగే ప్రతిదానికీ వెంటనే స్పందించకుండా, మన శరీరంలో ఏం జరుగుతుందో కాసేపు గమనించే అవకాశం యోగా మనకు ఇస్తుంది.

యోగా అంటే కేవలం శారీరక కదలికలే కాదు... ఏకాగ్రత కూడా!

ఏదైనా ఒక చిన్న యోగా భంగిమను ఉదాహరణగా తీసుకోండి. అది శరీరం సమతుల్యతను నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. కండరాలు పని చేస్తుంటాయి. మరోవైపు, శ్వాసపై దృష్టి ఉంచుతూ, ఎక్కడైనా శరీరంలో అసౌకర్యం ఉందేమో గమనిస్తుంటాం.

మధ్యలో మనసు ఎక్కడికో మళ్లుతుంది. అది గమనించిన తర్వాత మళ్లీ శ్వాసపైనా, చేస్తున్న సాధనపైనా దృష్టి పెడతాం.

ఈ చిన్న విషయం తరచూ మనం మర్చిపోతుంటాం.

యోగా అంటే కేవలం ఒక భంగిమలోకి రావడం మాత్రమే కాదు. ఆ భంగిమలో ఉన్నంతసేపూ మన శరీరం, శ్వాస, మనసులో ఏం జరుగుతుందో గమనించడం కూడా అందులో భాగమే.

శరీరంలో అసౌకర్యం, శ్వాస తీరు, మన దృష్టి ఎటు వెళ్తుందన్నది... ఇవన్నీ గమనిస్తూ సాధన చేస్తాం.

ఇలా మన శరీరం ఏం చెబుతుందో గమనించడం, మన దృష్టిని మళ్లీ తీసుకురావడం యోగా సాధనలో భాగం. ఈ అలవాటు రోజువారీ జీవితంలో మనలో ఏం జరుగుతుందో కొంత మెరుగ్గా గమనించేందుకు కూడా ఉపయోగపడవచ్చు.

అంత మాత్రాన యోగా మన భావోద్వేగాలపై పూర్తి నియంత్రణ ఇచ్చేస్తుందని కాదు. మనలో ఏం జరుగుతుందో గమనించడానికి, మన స్పందనల గురించి మరింత అవగాహన పెంచుకోవడానికి ఇది సహాయపడవచ్చు.

యోగా చేసిన ప్రతిసారీ రిలాక్స్‌గా అనిపించకపోవచ్చు

ఇక్కడ మరో విషయం గుర్తుంచుకోవాలి. యోగా చేసిన ప్రతిసారీ హార్ట్ రేట్ తగ్గాల్సిన అవసరం లేదు.

కొన్ని యోగా పద్ధతులు శారీరకంగా కాస్త కష్టంగా ఉంటాయి. వాటి సమయంలో శ్వాస వేగంగా మారొచ్చు, కండరాలు ఎక్కువగా పనిచేయొచ్చు, హార్ట్ రేట్ కూడా పెరగొచ్చు. ఇదంతా అసాధారణమేమీ కాదు.

అందుకే, “యోగా చేస్తే శరీరం పూర్తిగా రిలాక్స్ అవుతుంది” అనే మాట అన్ని రకాల యోగాలకు వర్తించదు. ఒక్కో రకమైన యోగా పద్ధతి, ఒక్కో రకమైన అనుభవాన్ని ఇవ్వొచ్చు.

యోగాలో తేలికపాటి ఆసనాల దగ్గరి నుంచి బాగా శ్రమ అనిపించే పద్ధతుల వరకు చాలా రకాలు ఉన్నాయి. ఈ తేడాలు పరిశోధనల్లో కనిపించే ఫలితాలను కూడా ప్రభావితం చేయవచ్చు.

కాబట్టి, యోగా చేసిన తర్వాత మీకు హాయిగా అనిపించిందా లేదా అన్నదానితోనే అది పనిచేసిందో లేదో నిర్ణయించలేం. యోగా వల్ల కలిగే ప్రభావం, చేసే పద్ధతిని బట్టి మారవచ్చు.

ఆరోగ్యకరమైన నాడీ వ్యవస్థ అంటే ఏమిటి?

ఈ మధ్య “నెర్వస్ సిస్టమ్ రెగ్యులేషన్” అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. సులభంగా చెప్పాలంటే, పరిస్థితిని బట్టి శరీరం తన స్పందనను మార్చుకోవడమే ఇది.

అంటే, ఎప్పుడూ ఒత్తిడి లేకుండా ఉండటం లేదా ఎప్పుడూ ప్రశాంతంగా ఉండటం అని కాదు.

ఒక కారు నడపడాన్ని ఊహించుకోండి. కొన్నిసార్లు వేగం పెంచాలి, కొన్నిసార్లు తగ్గించాలి, అవసరమైతే ఆపాలి. రోడ్డుపై పరిస్థితిని బట్టి వేగాన్ని మార్చుకోవడమే ముఖ్యం. ఎప్పుడూ ఒకే వేగంతో నడపడం లక్ష్యం కాదు.

మన నాడీ వ్యవస్థ కూడా ఇలాగే పనిచేస్తుంది. దేనిపైనైనా శ్రద్ధ పెట్టాల్సి వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండాలి. శారీరక శ్రమ చేస్తున్నప్పుడు శరీరం దానికి తగ్గట్టుగా స్పందించాలి. పని అయిపోయిన తర్వాత నిద్ర, విశ్రాంతి ద్వారా శరీరం కోలుకునే అవకాశం కూడా ఉండాలి.

కాబట్టి, ఎప్పుడూ ప్రశాంతంగా ఉండటమే ఆరోగ్యకరమైన నాడీ వ్యవస్థకు లక్షణం కాదు. అవసరమైనప్పుడు స్పందించడం, పరిస్థితి మారినప్పుడు మళ్లీ సర్దుకోవడం ముఖ్యం.

ఏడు రోజుల స్వీయ పరిశీలన

ఇదేమీ శాస్త్రీయ ప్రయోగం కాదు. యోగా చేసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుందో గమనించుకునే ఒక చిన్న మార్గం మాత్రమే.

ఏడు రోజుల పాటు, రోజుకు 10 నుంచి 15 నిమిషాలు తేలికపాటి యోగా సాధన చేయండి.

కష్టమైన ఆసనాలు చేయాల్సిన అవసరం లేదు. శరీరం ఎంత ఫ్లెక్సిబుల్‌గా ఉందో పట్టించుకోకండి. శ్వాసను బలవంతంగా మార్చకండి. వెంటనే పెద్ద మార్పు వస్తుందని కూడా ఆశించకండి.

యోగా మొదలుపెట్టే ముందు, 1 నుంచి 10 వరకు మీకు ఎంత ఒత్తిడి అనిపిస్తుందో ఒక స్కోర్‌ ఇవ్వండి.

యోగా పూర్తయ్యాక మళ్లీ ఒకసారి అదే విధంగా స్కోర్‌ ఇవ్వండి.

అదే సమయంలో ఇంకొన్ని విషయాలను కూడా గమనించండి: భుజాలు ఇంకా బిగుసుకుని ఉన్నాయా? శ్వాసలో ఏమైనా మార్పు అనిపిస్తుందా? మనసులో ఆలోచనలు కాస్త తగ్గాయా? శరీరం తేలికగా అనిపిస్తోందా, లేక అలాగే ఉందా?

ఏడు రోజుల తర్వాత, మీకు ఏమైనా తేడా అనిపించిందో చూడండి.

యోగా మీకు ఉపయోగపడొచ్చు, లేదా పెద్దగా మార్పు అనిపించకపోవచ్చు. ఈ పరిశీలన మీ అనుభవాన్ని అర్థం చేసుకోవడానికి మాత్రమే; యోగా ఎంతవరకు పనిచేస్తుందనే విషయాన్ని దీనితో నిర్ధారించలేం.

10 నిమిషాల తేలికపాటి సాధన

దీనికి కష్టమైన ఆసనాలు చేయాల్సిన అవసరం లేదు.

1వ నిమిషం — కాసేపు ఆగండి

  • హాయిగా కూర్చోండి.
  • మీ శరీరం ఎలా ఉందో గమనించండి.
  • ఇప్పుడే ఏదైనా మార్చాలని ప్రయత్నించకండి.

2–3 నిమిషాలు — శ్వాసను గమనించండి

  • మీ శ్వాస సహజంగా ఎలా ఉందో గమనించండి.
  • వీలైతే, శ్వాసను కాస్త నెమ్మదిగా, సౌకర్యంగా సాగనివ్వండి.
  • బలవంతంగా లోతుగా శ్వాస తీసుకోకండి.

4–7 నిమిషాలు — తేలికపాటి కదలికలు

  • భుజాలను నెమ్మదిగా తిప్పండి.
  • చేతులను పైకి, ముందుకు చాచండి.
  • మెడను ఎడమ, కుడి వైపులకు మెల్లగా కదపండి.
  • కూర్చున్న చోటే నడుమును హాయిగా పక్కకు తిప్పండి.
  • శరీరంలో ఏం అనిపిస్తుందో గమనిస్తూ నెమ్మదిగా కదలండి.
  • ఎక్కడైనా నొప్పిగా లేదా అసౌకర్యంగా అనిపిస్తే ఆపేయండి.

8–9 నిమిషాలు — ప్రశాంతంగా కూర్చోండి

  • ఇక కదలకుండా ప్రశాంతంగా కూర్చోండి.
  • మీ శ్వాసను, భుజాలను గమనించండి.
  • మొదలుపెట్టినప్పటి కంటే ఇప్పుడు ఏమైనా తేడా అనిపిస్తుందో చూడండి.

10వ నిమిషం — మళ్లీ మీ పనుల్లోకి రండి

  • కాసేపు సహజంగా శ్వాస తీసుకోండి.
  • మెల్లగా లేచి నిలబడండి.
  • ఆపై మీ రోజువారీ పనులను కొనసాగించండి.

దీనివల్ల కచ్చితంగా ప్రశాంతంగా అనిపించాలనే నిబంధనేమీ లేదు. కొద్దిసేపు శరీరం, శ్వాసపై దృష్టి పెట్టడానికి ఇదొక చిన్న విరామం మాత్రమే.

మనసు ఎంతకీ కుదుటపడకపోతే?

అది చాలా సహజం.

యోగా, ధ్యానం గురించి ఉన్న ఒక పెద్ద అపోహ ఏంటంటే—ఆలోచనలను పూర్తిగా ఆపేయడమే వాటి లక్ష్యం అని అనుకోవడం.

మెదడులో ఆలోచనలు రావడం ఆగిపోవు. పూర్తి చేయాల్సిన పనులు, రాత్రి భోజనం, లేదా కొన్నేళ్ల క్రితం జరిగిన విషయం... ఏదైనా ఉన్నట్టుండి గుర్తుకు రావచ్చు.

అంతమాత్రాన మీరు యోగా సరిగ్గా చేయట్లేదని కాదు.

ధ్యాస పక్కకు మళ్లిందని గమనించి, దాన్ని మళ్లీ నెమ్మదిగా వెనక్కి తీసుకురావడమే అసలైన సాధన.

మళ్లీ మళ్లీ అలాగే చేస్తూ ఉండటం.

అంతే తప్ప, మీ ఆలోచనలతో పోరాడాల్సిన అవసరమే లేదు.

యోగా ఏం చేయలదు?

యోగా జీవితంలోని ప్రతి ఒత్తిడినీ మాయం చేయదు. మీకు ఎప్పటికీ ఆందోళన కలగదని గ్యారెంటీ ఇవ్వదు. ఇది నిద్రకు ప్రత్యామ్నాయం కాదు. ఆఫీసులోని విషపూరితమైన వాతావరణాన్ని సరిచేయదు, ఆర్థిక సమస్యలను కూడా పరిష్కరించదు.

అలాగే, యోగా వైద్య లేదా మానసిక చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు.

ఎవరైనా తీవ్రమైన ఆందోళన, డిప్రెషన్, ట్రామా లక్షణాలు లేదా ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే, తగిన వైద్య నిపుణుల సహాయం తీసుకోవడం ముఖ్యం.

అలాంటి చికిత్సతో పాటు యోగాను ఒక సహాయక సాధనంగా ఉపయోగించుకోవచ్చు. కానీ ప్రతి సమస్యకూ యోగానే పరిష్కారం అన్నట్టు చూడటం సరైంది కాదు.

సరైన పద్ధతిలో, శిక్షణ పొందిన నిపుణుల మార్గదర్శకత్వంలో చేసే యోగా ఆరోగ్యంగా ఉన్నవారికి సాధారణంగా సురక్షితమే. అయితే, ఇతర శారీరక వ్యాయామాల్లాగే యోగా చేస్తున్నప్పుడు కూడా గాయాలు అయ్యే అవకాశం ఉంది.

కొత్తగా యోగా మొదలుపెట్టేవారు కఠినమైన ఆసనాలు, బలవంతపు శ్వాసాభ్యాసాలు చేయకుండా నెమ్మదిగా మొదలుపెట్టడం మంచిది. గర్భిణులు, వయోవృద్ధులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తమ అవసరాలకు తగిన మార్పుల గురించి వైద్య నిపుణుడిని, యోగా శిక్షకుడిని సంప్రదించాలి.

యోగా గురించి తరచూ వినిపించే వాదనలు

వీటిలో కొన్ని విషయాల గురించి మనం ఇప్పటికే మాట్లాడుకున్నాం. అయినా, యోగా గురించి తరచూ వినిపించే కొన్ని వాదనలను ఒకసారి సులభంగా గుర్తు చేసుకుందాం.

“యోగా నాడీ వ్యవస్థను రీసెట్ చేస్తుంది.” “రీసెట్” అనేది విషయం సులభంగా అర్థం చేసుకోవడానికి వాడే మాట మాత్రమే. నాడీ వ్యవస్థ ఏదో స్విచ్‌లా ఒక్కసారిగా రీసెట్ అవుతుందని చెప్పడం శాస్త్రీయంగా సరైన వివరణ కాదు.

“యోగా వేగస్ నర్వ్‌ను యాక్టివేట్ చేస్తుంది.” యోగా, ముఖ్యంగా శ్వాసాభ్యాసాలు, ఆటోనామిక్ నాడీ వ్యవస్థపై ప్రభావం చూపవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. కానీ వాగస్ నాడి ఏదో స్విచ్‌లా యోగా చేయగానే ఒక్కసారిగా “యాక్టివేట్” అవుతుందని చెప్పడం పూర్తి శాస్త్రీయ వివరణ కాదు. అలాగే HRV అనేది వాగస్ నాడి పనితీరును నేరుగా కొలిచే సాధనం కాదు.

“యోగా ఎల్లప్పుడూ HRVని పెంచుతుంది.” కొన్ని పరిశోధనల్లో యోగా తర్వాత HRVలో మార్పులు కనిపించాయి. కానీ ఫలితాలు అన్నీ ఒకేలా లేవు. చాలా అధ్యయనాలు చిన్నవిగా ఉండటం, వాటి పద్ధతుల్లో తేడాలు ఉండటం వల్ల యోగా ఎల్లప్పుడూ HRVని పెంచుతుందని చెప్పలేం.

“యోగా ఒత్తిడిని తగ్గిస్తుంది.” కొన్ని పరిశోధనలు యోగా వల్ల ఒత్తిడి తగ్గవచ్చని సూచిస్తున్నాయి. 2024లో ప్రచురితమైన ఒక systematic reviewలో కూడా తక్కువకాలంలో ఒత్తిడి తగ్గినట్లు కనిపించింది. అయితే ఆ ఆధారాల నాణ్యత తక్కువగా ఉందని పరిశోధకులు పేర్కొన్నారు. కాబట్టి యోగా చేస్తే ప్రతి ఒక్కరిలో ఒత్తిడి తప్పకుండా తగ్గుతుందని చెప్పలేం.

యోగాను అర్థం చేసుకోవడానికి సైన్స్‌ను ఉపయోగించడం ఒక విషయం. యోగాను ప్రచారం చేయడానికి సైన్స్‌ పదాలను వాడటం మరో విషయం.

యోగా గురించి ఏం తెలుసు? ఇంకా ఏం స్పష్టంగా లేదు?

మనకు బాగా తెలిసిన విషయాలు:

యోగాలో శారీరక కదలికలు, శ్వాసాభ్యాసాలు, ఏకాగ్రత, ధ్యానం వంటి భాగాలు ఉండవచ్చు. యోగా సాధారణ ఆరోగ్యం, ఒత్తిడి నియంత్రణకు కొంత తోడ్పడవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. అయితే, యోగా చేసే విధానం, అధ్యయనం చేసిన వ్యక్తులు వంటి విషయాలను బట్టి ఫలితాలు మారవచ్చు.

ఆశాజనకంగా కనిపిస్తున్న ఫలితాలు:

యోగా వల్ల కొందరిలో ఒత్తిడి భావన తగ్గవచ్చని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. 2024లో జరిగిన ఒక systematic reviewలో కూడా తక్కువకాలంలో perceived stress తగ్గినట్లు కనిపించింది. అయితే, ఈ ఫలితాలకు సంబంధించిన ఆధారాల నాణ్యత తక్కువగా ఉందని పరిశోధకులు చెప్పారు.

ఇంకా స్పష్టత లేని విషయాలు:

యోగా వల్ల కనిపించే ఈ మార్పులు అసలు ఎలా వస్తాయి? యోగాలో ఏ భాగం ఎక్కువగా పనిచేస్తుంది? ఏ విధమైన యోగా ఎవరికి ఎక్కువగా ఉపయోగపడుతుంది? ఈ ప్రభావాలు ఎంతకాలం ఉంటాయి? వంటి ప్రశ్నలకు ఇంకా పూర్తి సమాధానాలు లేవు. యోగా చేసే విధానం, అధ్యయనాల్లో ఉపయోగించిన పద్ధతులు వేర్వేరుగా ఉండటం కూడా దీనికి ఒక కారణం.

అతిగా చెప్పకూడని విషయాలు:

యోగా అందరిలోనూ నాడీ వ్యవస్థను “రీసెట్” చేస్తుందని గానీ, వాగల్ టోన్‌ను ఖచ్చితంగా పెంచుతుందని గానీ, వైద్య లేదా మానసిక చికిత్సకు బదులుగా పనిచేస్తుందని గానీ చెప్పకూడదు. ఇలాంటి కొన్ని మాటలు సైన్స్‌లో వాడే పదాల ఆధారంగా ప్రచారంలోకి వచ్చిన సరళీకరణలు మాత్రమే. HRV కూడా వాగస్ నాడి పనితీరును నేరుగా కొలిచే సాధనం కాదు.

ఇది అంత సంచలనమైన హెడ్‌లైన్ కాకపోవచ్చు. కానీ ఆరోగ్యం గురించి మాట్లాడేటప్పుడు, ఏది మనకు తెలిసిందో, ఏది ఇంకా స్పష్టంగా తెలియదో చెప్పడం ముఖ్యం.

యోగా గురించి చివరగా గుర్తుంచుకోవాల్సిన విషయం

ఒక మంచి అలవాటు వల్ల మనకు ఉపయోగం కలగాలంటే, అది శరీరంలో సరిగ్గా ఎలా పనిచేస్తుందో పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు.

మీరు క్రమం తప్పకుండా సాధన చేస్తే... “నేను ఒత్తిడిలో ఉన్నాను” అని అనిపించడానికి, “నాలో ఒత్తిడి ఉందని నేను గమనిస్తున్నాను” అని తెలుసుకోవడానికి మధ్య ఉన్న తేడా మీకు అనుభవంలోకి రావచ్చు. ఆ చిన్న మార్పు, ఒత్తిడికి మీరు స్పందించే తీరులో కొంత మార్పు తీసుకురావచ్చు.

యోగా ఉపయోగపడటానికి అది ఏదో పెద్ద అద్భుతంలా పనిచేయాల్సిన అవసరం లేదు. సరళంగా చెప్పాలంటే, శారీరక కదలికలు, శ్వాస, ఏకాగ్రత వంటి వాటిని ఒకచోటకు తీసుకురావడం ద్వారా కొందరికి ఒత్తిడిని ఎదుర్కోవడంలో, మనసు కాస్త తేలికపడటంలో సహాయపడవచ్చు. పరిశోధనలు కూడా అలాంటి అవకాశం ఉందని సూచిస్తున్నాయి. అయితే, ఇప్పుడున్న ఆధారాలకు కొన్ని పరిమితులు ఉన్నాయని కూడా గుర్తుంచుకోవాలి.

ఒక మ్యాట్ పరిచి, నెమ్మదిగా కదులుతూ, సహజంగా శ్వాస తీసుకుంటూ కాసేపు మీ శరీరాన్ని, మీ మనసును గమనించండి. తర్వాతి పని కోసం మళ్లీ పరిగెత్తే ముందు, ఆ కొద్దిసేపు సమయాన్ని మీ కోసం మీరు కేటాయించుకోండి.

అంతే.

తరచూ అడిగే ప్రశ్నలు (FAQs)

ప్ర: యోగా నిజంగానే నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుందా?

జ: యోగా అటానమిక్ నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుందని, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. కానీ ఈ మార్పులు అసలు ఎలా జరుగుతాయనే దానిపై పరిశోధకులు ఇంకా అధ్యయనాలు చేస్తున్నారు. అంతేకాకుండా, యోగా పద్ధతిని బట్టి, అధ్యయనంలో పాల్గొన్న వ్యక్తులను బట్టి ఈ ఫలితాలు మారవచ్చు.

ప్ర: ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా మంచిదేనా?

జ: యోగా కొందరిలో—ముఖ్యంగా స్వల్పకాలికంగా—ఒత్తిడి భావనను తగ్గించడంలో సహాయపడుతుంది. తీవ్రమైన ఒత్తిడితో బాధపడుతున్న పెద్దలలో యోగా వల్ల తాత్కాలికంగా ఒత్తిడి తగ్గిందని 2024 నాటి ఒక సిస్టమాటిక్ రివ్యూ వెల్లడించింది. అయితే, ఈ అధ్యయనాల నాణ్యత తక్కువ స్థాయిలో ఉన్నట్లు పరిశోధకులు పేర్కొన్నారు.

ప్ర: యోగా వేగస్ నర్వ్‌ను యాక్టివేట్ చేస్తుందా?

జ: యోగా నేరుగా వేగస్ నర్వ్‌ను "యాక్టివేట్" చేస్తుందని ఒకే మాటలో చెప్పడం సరైనది కాదు. యోగా—ముఖ్యంగా శ్వాస ప్రక్రియలు—అటానమిక్ నాడీ వ్యవస్థపై ప్రభావం చూపవచ్చు. కానీ మీరు యోగా చేయగానే వేగస్ నర్వ్ ఏదో స్విచ్ వేసినట్లు ఆన్ అయిపోదు. అలాగే, HRV అనేది వేగస్ నర్వ్ పనితీరును నేరుగా కొలిచే కొలమానం కాదని కూడా గుర్తించాలి.

ప్ర: యోగా వల్ల HRV పెరుగుతుందా?

జ: యోగా చేసిన తర్వాత HRV లో మార్పులు వచ్చినట్లు కొన్ని అధ్యయనాల్లో తేలింది. కానీ ఈ ఫలితాలు అన్ని అధ్యయనాల్లోనూ ఒకేలా లేవు. చాలా పరిశోధనలు తక్కువ మందిపైనే జరిగాయి, పైగా వేర్వేరు పద్ధతులను ఉపయోగించాయి. కాబట్టి యోగా వల్ల ఎల్లప్పుడూ HRV పెరుగుతుందని చెప్పడానికి తగిన ఆధారాలు లేవు.

ప్ర: ఒత్తిడి తగ్గడానికి ఏ రకమైన యోగా ఉత్తమమైనది?

జ: ఒత్తిడికి ఏ ఒక్క రకమైన యోగా మాత్రమే బాగా పనిచేస్తుందని నిరూపితం కాలేదు. యోగాలో తేలికపాటి ఆసనాల నుంచి ఎంతో శారీరక శ్రమతో కూడిన పద్ధతుల వరకు చాలా రకాలు ఉన్నాయి. వీటి ప్రభావం ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. కాబట్టి మీకు సౌకర్యవంతంగా అనిపించే, క్రమం తప్పకుండా చేయగలిగే ఏదో ఒక శైలితో సాధన ప్రారంభించడం మంచిది.

ప్ర: ఒత్తిడి తగ్గడానికి రోజుకి ఎంతసేపు యోగా చేయాలి?

జ: అందరికీ సరిపోయేలా ‘ఇంత సమయం చేయాలి’ అనే కచ్చితమైన నియమమేదీ లేదు. వేర్వేరు అధ్యయనాలు వేర్వేరు యోగా రకాలను, సమయాలను ఉపయోగించాయి. కాబట్టి రోజుకి ఇన్ని నిమిషాలు చేయాలనే ఆందోళన కంటే... మీకు హాయిగా అనిపించే కొద్దిపాటి సమయంతో మొదలుపెట్టి, దాన్ని క్రమం తప్పకుండా కొనసాగించడమే అత్యంత ఆచరణాత్మకమైన మార్గం.

ప్ర: తక్కువ సమయం చేసే యోగాతో ఒత్తిడి తగ్గుతుందా?

జ: తగ్గే అవకాశం ఉంది. కొద్దిసేపు చేసే యోగా లేదా దానితో పాటు చేసే శ్వాస వ్యాయామాలు, ధ్యానం వంటివి తక్షణ ఒత్తిడిని తగ్గించడంలో సానుకూల ఫలితాలను చూపించినట్లు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ అధ్యయనాల ఫలితాల్లో తేడాలు ఉన్నందున, కొద్దిసేపు యోగా చేసిన ప్రతీసారీ ప్రశాంతత లభిస్తుందని కచ్చితంగా హామీ ఇవ్వలేము.

ప్ర: యోగా వైద్య చికిత్సకు లేదా థెరపీకి ప్రత్యామ్నాయంగా పనికొస్తుందా?

జ: కానే కాదు. వైద్య లేదా మానసిక ఆరోగ్య చికిత్సలతో పాటు యోగాను ఒక సహాయక సాధనగా ఉపయోగిస్తే మేలు జరుగుతుంది. కానీ వైద్య నిపుణుల అవసరం ఉన్నప్పుడు యోగాను చికిత్సకు ప్రత్యామ్నాయంగా వాడకూడదు.

ప్ర: యోగా చేయడం సురక్షితమేనా?

జ: అనుభవజ్ఞులైన యోగా శిక్షకుల పర్యవేక్షణలో సరైన పద్ధతిలో సాధన చేసినప్పుడు ఆరోగ్యంగా ఉండే వ్యక్తులకు యోగా సురక్షితమైనదే. కొత్తగా ప్రారంభించేవారు నెమ్మదిగా మొదలుపెట్టాలి; కఠినమైన ఆసనాలు, బలవంతపు శ్వాస వ్యాయామాలకు దూరంగా ఉండాలి. గర్భిణులు, వయోవృద్ధులు, గాయపడినవారు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు నిపుణుల సలహాతో తమకు తగిన మార్పులతో కూడిన ఆసనాలు మాత్రమే చేయాలి.

ప్ర: యోగా చేయాలంటే శరీరంలో ఫ్లెక్సిబిలిటీ ఉండాలా?

జ: అవసరమే లేదు. యోగా ప్రారంభించడానికి శరీరంలో ఫ్లెక్సిబిలిటీ ఉండాల్సిన పనిలేదు. సరళమైన కదలికలతో మొదలుపెట్టి, మీ శరీరానికి సౌకర్యంగా ఉండేలా ఆసనాల్లో మార్పులు చేసుకుంటూ సాధన చేయవచ్చు.

ఈ వ్యాసం గురించి

ఈ వ్యాసంలోని సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే, ఇది ఎంతమాత్రం వైద్య సలహా కాదు. యోగా, ఒత్తిడి, నాడీ వ్యవస్థలపై ప్రస్తుత పరిశోధనలు ఏం చెబుతున్నాయో ఇందులో వివరించడం జరిగింది. అలాగే, ఏ విషయాల్లో శాస్త్రీయ ఆధారాలు ఇంకా స్పష్టంగా లేవో కూడా ఇక్కడ తెలియజేశాం.

ఆరోగ్యకరమైన జీవనశైలిలో యోగా ఒక భాగం కావచ్చు. అయితే, మీకు అవసరమైన వైద్య లేదా మానసిక ఆరోగ్య సంరక్షణకు ఇది ప్రత్యామ్నాయం కాకూడదు, అలాగే ఆ చికిత్సలు పొందడాన్ని ఆలస్యం చేసేలా ఉండకూడదు. మీకు ఏవైనా గాయాలు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నా, గర్భవతి అయినా, లేదా యోగా సాధన మీకు సరిపోతుందో లేదో సందేహంగా ఉన్నా... తగిన అర్హత కలిగిన వైద్య నిపుణులను సంప్రదించడమే ఉత్తమం.

Post a Comment

Previous Post Next Post